Sunday 21 December 2014

"రసధుని" - తిరుప్పావై ఆంధ్రీకరణ



ఇది "రసధుని". ఆముక్తమాల్యదయైన శ్రీ గోదాదేవి అమృతవాక్కుల నుండి వెలువడిన "తిరుప్పావై"కి ఆంధ్రీకృత రూపం. "పావై" అంటే "వ్రతం" అని అర్ధమట. "తిరుప్పావై" అంటే "ఆమె దివ్యవ్రతం" లేదా "శ్రీవ్రతం". "రసో వై సః" అన్నారు గనుక, ఆంధ్రీకర్త, ముముక్షుమహాజన పీఠాధిపతి  శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులవారు దీనికి "రసధుని" అని నామకరణం చేశారు. గృహ, దేవాలయాల్లో సేవాకాలంలో వినియోగం నిమిత్తం దీనిని రూపొందించి భక్తకోటికి సమర్పిస్తున్నాం. స్వీకరించి మమ్ము ఆశీర్వదించగలరని ఆశిస్తున్నాం.

సమర్పణ: జాహ్నవీ ఆర్ట్ ప్రొడక్షన్స్, ఏలూరు
స్వరకల్పన-గానం: కుమారి బి.కె.బిందు
వాద్య సహకారం-ధ్వనిముద్రణ: శ్రీ ఎస్.పీ.ఎస్. వాసు, శ్రీ అమీర్ బృందం
నిర్వహణ: మహమ్మద్ ఖాజావలి
నిర్మాత: డా. అల్లూరి వేంకట నరసింహరాజు












Wednesday 26 February 2014

మానవుడా!


(Picture: Courtesy of Google Images)

పిల్లి బలవంతాన తలుపువేసి కొడితే యేంచేస్తుంది...
కళ్ళు పీకేస్తుంది !
బలా బలాలు సమస్యే కాదు...
బాధ యెంత పనైనా చేయిస్తుంది...
నీవంటే భయం లేక కాదది వచ్చింది...
నీరసంతో కృంగి, కృశించలేక...
గ్రుక్కెడు పాలు త్రాగడానికి దొరికితే,
ప్రక్కలు విరిగినా ఫరవా లేదనుకుంది...
మరీ అంత దారుణానికి దిగుతాడా
మనిషన్న వాడనుకుంది !
కసికొద్దీ నీవు కొట్టబోతే...
గతిలేక తిరగబడింది.
పిల్లిని చంపిన పాపం బంగారు
పిల్లిని దానంచేస్తేగానీ పోదట...!
దానికైనా సిద్ధమౌతావు గాని
దయదలిచి కాసిని పాలు త్రాగనీయవు...!!
మానవాకారం దాల్చిన దానవుడవు నీవు,
మాత్సర్యం తలకెక్కిన బుద్ధి హీనుడవు నీవు...

(1960 దశకంలో వ్రాసిన కవిత)

Monday 24 February 2014

రైతుబిడ్డ

(Picture: Courtesy of Google Images)

ఉ|| నేనొక రైతుబిడ్డను; పునీత, ఫలప్రదయైన తెల్గు మా
గాణము నాది; కావున సగర్వముగా నిరతాన్నదాతనై
దీనుల బ్రోతు ... నా భరత దేశమె కాదు సమస్త ధారుణీ
మానవులెల్ల నాకు నభిమానులు, మిత్రులు, నిష్టబంధువుల్

ఉ|| నేనొక రైతుబిడ్డను; వినిర్మల ధర్మ పథానువర్తినై,
మానవ జీవితమ్మున సమస్తము సత్యము, సుందరం, శివం
బేనని...జాతి, వర్గ, కుల భేదము లెన్నక విశ్వశాంతి సం
ధానము సేయుటొక్కటె ప్రధానమటం చెలుగెత్తి చాటెదన్

ఉ|| నేనొక రైతుబిడ్డను; వినీత మనస్కుడ; తెల్గుతల్లి సం
స్థానమునన్ కవీశ్వరుడ; సాత్త్విక తాత్త్విక భావవాహినిన్
స్నానము చేసి, నవ్యమృదు శబ్దసుమమ్ముల పద్యమాలికల్
పూనికగూర్చి, మాతృపద పూజనొనర్చి కృతార్ధునయ్యెదన్

(1960 దశకంలో వ్రాసిన పద్యములు)

సీతాకోక చిలుక

(Picture: Courtesy of Google Images)

రంగు రంగుల రెక్కలతో
సింగారంగా ఎగిరే
సీతాకోక చిలుకా...నీ పూర్వ
స్థితేమిటో గుర్తుందా?

ఆకు అలము తింటూ,
ఆ పంచా ఆ పంచా చేరితే,
అడ్డమైనవాడు నిన్ను చూచి,
అసహ్యించుకున్నాడానాడు...!

మానాభిమానా లున్నదానివి గనుకనే
మంచం పట్టేవు కొన్నాళ్ళు...!
చచ్చావో ఉన్నావో తెలిసికొనేందుకైనా,
వచ్చి చూచిన పాపాన పోలేదు ఒక్కడూ...!

సహించి పరీక్షకై నిలిచావు గనుకనే,
సహాయం చేశాడు నీకు భగవానుడు...
ఆకర్షనీయమైన స్థితి వచ్చినప్పుడు
ఆహ్వానాలకేం లోటింకిప్పుడు...?

"అందాల రాణి" అని బిరుదిస్తారు మక
రందం వద్దన్నా అందిస్తారు...!
లోకం తీరు గ్రహించు-దానికి
లోబడక స్వేచ్ఛగా ప్రవర్తించు...!!

(1960 దశకంలో వ్రాసిన కవిత)

Monday 3 September 2012

చినుకులు


(Picture: Courtesy of Google Images)


నీరవ నిశీధివేళ కన్నీరు విడువ
నేల యని ననుమీరు ప్రశ్నింపవలదు
బాధ కాదిది; ఒక యోగ సాధనమ్ము!
క్షణములో దివిని చేరు లక్షణము నాది 1

***

పాదరస బిందువులవంటి బాష్పములను
విడుచు చుంటివి నెచ్చెలీ! విఫలమైన
స్వాప్నిక ప్రేమ మృదుల సంస్పర్శ వలన
పులకరించెనె మేను? చెప్పుము లతాంగి! 2

***

ముకురమును బోలు ఆకాశమున అనేక
చిత్రముల గీసి పెట్టెనె చెప్పకుండ;
వేకువనె లేచి తొలిసంధ్య వెలుగులోన
కాంచితిని; ఓహొ! ఆ చిత్రకారుడెవడొ!! 3

***

అలిగి ఆకాశమున కేగు పులుగులన్ని
బుజ్జగింపగ వచ్చెనీ భూమిపైకి;
ముచ్చటగ చూచు నక్షత్రముల నదల్చ
దూరతీరాల కెచటికో పారిపోయె! 4

***

బొమ్మలా కాదు ఇవి మన భూమి పైన
కల విచిత్రములన్నియు కలసివచ్చి
కూరుచున్నవి ఎవ్వరి కోరికలకు
ప్రతిఫలమ్ములొ నేను చెప్పను సుమండి 5

***

కాలధర్మము చెందిన కవులు చెప్పు
కథలు వినుచుంటిమాయె ఉత్కంఠ తోడ
నీవు పోయిన వెన్క అన్నియును సున్న
అనుకొనకు పద్యమన్నది అమృతగుళిక 6

***

లేదు నా కోర్కె తీరనేలేదు; మంచి
మానవుల చూడ ఈ రాజధాని వచ్చి
విసిగుచెందితి; ఈ రాతి విగ్రహములు
మాటలాడవు; ఇసుమంత చోటునీవు! 7

***

పాడినదె పాట; ఇక మాటలాడనేమి
మిగులు దిన, వార, పక్ష సమ్మేళనముల!
దంచినదె దంచి, దక్కినదంత బొక్కి
తిరిగి వెదకుము; కొత్త తద్దినము కొరకు!! 8

***

ఎత్తిపోతల పధకము నెవరు మొదలు
పెట్టిరో గాని అది ప్రతి పట్టణమున
అమలు జరుగుచు తిరిగి ముమ్మరము సేయ
లబ్ధిదారులు వేలును లక్షలైరి 9

***

పిచ్చివాడను నామము వచ్చెనేమి
ఇచ్చవచ్చినయట్లు వర్తింపవచ్చు
కాకపోయిన ఈ పాడు లోకమునకు
నమ్మకము కల్గ దెంత వైనముగ జెప్ప 10

***

ఎప్పుడో ఎక్కడో మరి తప్పకుండ
తలచుకొను నిన్ను మంచి పద్యమ్ము తగుల
తెలిసికొను తాత పేరు తద్దినము నాడు
కాని నీ పేరు అతగాని కంఠ గతము 11

***

Friday 31 August 2012

తెలుగు మరుగులు


అసలు ఆంధ్రుల్లో కవి కానివాడు, అరవ వారిలో గాయకుడు కానివాడు ఉండనేఉండడని చమత్కరించాడో పెద్దమనిషి. "అంతా కవులము కాదా, అంతింతో తెలుగు పద్యమల్లగలేమా" అంటారు మనవాళ్ళు. నిజానికి కవిత్వం రాయాలంటే ఎంతో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఉండాలి. ప్రతిభ అంటే సృజనాత్మక శక్తి. అది పుట్టుకతో వస్తుంది. వ్యుత్పత్తి అంటే పాండిత్యం. అది విస్తృత గ్రంథపఠనం వల్ల వస్తుంది. ఇక అభ్యాసం అంటే నిరంతర సాధన. ఈ మూడూ పుష్కలంగా ఉన్నవాడే నిజంగా కవి. లేకపోతే, "కవియను నామమ్ము నీటికాకికి లేదే" అంటారు.

మూడున్నర దశాబ్దాలపాటు నాకు తెలుగుభాషా సాహిత్యాల బోధనలో అనుభవం ఉన్న కారణంగా అనేక అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. ఒకసారి నేను ఒక ప్రాధమిక పాఠశాల తనిఖీ చేయడానికి వెళ్ళాను. నేనొక తరగతి గదిలో ఉండగా ఆప్రక్క గదిలో ఎవడో ఒక కుర్రవాడు బాధపడుతున్నట్టు అనిపించింది. వాడు, "అప్పా, అఫ్ఫా, అబ్బా, అభ్భా, అమ్మా, అయ్యా..." అని రొప్పుతున్నాడు. మాస్టారు ఏమీ పట్టించుకున్నట్టు లేదు. రెండు నిమిషాలు చూశాను. ఇక ఉండబట్టలేక వెళ్ళి మాస్టరిని అడిగాను. ఆ కుర్రాడు, "ప, ఫ, బ, భ..." లు చదువుతున్నాడట. వాడు ఏ అక్షరాన్ని పలకాలన్నా, ముందు "ఆ" అంటేగాని పలకలేడట. అందువల్లనే, "ప, ఫ, బ, భ, మ, య" అనే అక్షరాలను "అప్పా, అఫ్ఫా, అబ్బా, అభ్భా, అమ్మా, అయ్యా" అని పలుకుతున్నాడు. అంతే తప్ప వాడు ఏ కడుపునొప్పితోను బాధపడడంలేదట. ఇదీ విషయం!

ఇంకోసారి నేను బాలవ్యాకరణం పాఠం చెబుతున్నాను. తొలిరోజున చెప్పిన సూత్రాన్ని, మర్నాడు పునశ్చరణ చేసి ఆ తరువాత కొత్త సూత్రాన్ని చెప్పడం నాకలవాటు. మొదటిరోజున "రుగాగమ సంధి" సూత్రాన్ని చెప్పాను. "పేదరాలు, ముద్దరాలు, బాలింతరాలు..." మున్నగు ఉదాహరణలు చెప్పాను. మర్నాడు పునశ్చరణలో విద్యార్థులు సూత్రాన్ని, ఉదాహరణలను టకటకా చెప్పేస్తున్నారు. దానితో నేను, "పేదరాలు, ముద్దరాలు సూత్రాల్ని చెప్పడం కాదయ్యా, ప్రియురాలు సూత్రం ఎవరైనా చెప్పగలరా?" అన్నాను. వెంటనే, "ప్రియురాలికి సూత్రం ఎందుకండీ?" అన్నాడు వెనక బెంచి నుంచి ఎవడో. అంతా ఘొల్లున నవ్వారు. "ఎవరయ్యా, ఆ అన్నది?" అన్నాను. తప్పనుకొని నేను కాదంటే, నేను కాదని చెప్పి తప్పించుకున్నారు. చివరకు తరువాత వచ్చే సూత్రాన్నీ, దాని రూపాన్నీ, అతగాడన్న వాక్యంలోని చమత్కారాన్నీ విడమర్చి చెబితే అంతా దానిలో ఉన్న స్వారస్యాన్ని అర్థం చేసుకుని నవ్వుకున్నారు. ఇప్పటికీ ఆ పూర్వ విద్యార్థులు కనిపిస్తే, "మేము ప్రియురాలి బ్యాచి వాళ్ళమండీ" అంటుంటారు.

ఒకసారి నేను, తణుకు ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. చెఱువు సత్యనారాయణ శాస్త్రి, రేపల్లె సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ ముళ్ళపూడి రామ సూర్యనారాయణ శాస్త్రి, అఖిల భారత సంస్కృత సమ్మేళనంలో పాల్గొనడానికి రైల్లో రాజమండ్రి నుంచి హుగ్లీ వెడుతున్నాము. ముగ్గురుకీ బెర్తులు సత్యనారాయణ శాస్త్రే రిజర్వు చేయించాడు. ముగ్గురూ కాసేపు కబుర్లు చెప్పుకుని పడుకున్నాము. అంతలో టి.టి. వచ్చాడు. మధ్య బెర్తులో ఉన్న సత్యనారాయణ శాస్త్రి టిక్కెట్టు చూపించాడు."డా||సి.యస్.శాస్త్రి - రైట్!, డా|| ఎ.వి.యన్.రాజు - రైట్!", అని టిక్కు పెట్టుకున్నాడు. పైన పడుకున్న ఎమ్మారెస్ ను చూచి "దిగు దిగు" మన్నాడు. శాస్త్రి బిత్తరపోయి "నాకూ రిజర్వేషన్ ఉంది, మావాడు చూపించలేదా?" అన్నాడు. "అది మిసెస్ శాస్త్రి బెర్తు. ఇతరులు ఆక్యుపై చెయ్యడానికి వీల్లేదు. టికెట్ నాట్ ట్రాన్స్ఫరబుల్" అని దబాయించాడు టి.టి. చివరకు మేము ముగ్గురుం కలగజేసుకుని "ఎమ్మారెస్ శాస్త్రి అంటే మిసెస్ శాస్త్రి కాదండి బాబూ! ముళ్ళపూడి రామ సూర్యనారాయణ శాస్త్రి. ఇదిగో ఈ ప్రక్క సెక్స్ అన్న దగ్గర ఎం ఉంది చూడండి!" అని చెప్పి ఒప్పించవలసి వచ్చింది. sకనుక ఏదో కాగితం మీద ఉన్నది చదివితే చాలదు; దానికి కొంత ఆలోచన లోకజ్ఞత కూడా ఉండాలి.

ఇక వ్యుత్పత్తి అనుకున్నాం కదా. అంటే ఉచిత పద ప్రయోగ దక్షత అన్నమాట. దానికి కావలసిన పదసంపద పుస్తకంలో కాదు, మస్తకంలో ఉండాలి. అందుకే మనవాళ్ళు పిల్లల చేత శతక పద్యాలను కంఠస్థం చేయించేవాళ్ళు. నేను సుమతీ శతకంలోని "అప్పిచ్చువాడు వైద్యుడు" అనే పద్యాన్ని చదివి, "అప్పిచ్చేవాడు వైద్యుడు ఎలా అవుతాడు?" అని తర్కించుకునేవాడిని. తరవాత కావచ్చునేమో అనుకుని సందేహంతోనే సరిపెట్టుకునేవాణ్ణి. అలాగే, "ధర తగ్గుట హెచ్చు కొఱకె" అనే పద్య పాదాన్ని చదివి, "ధర తగ్గడం హెచ్చడం కోసమే" అనుకునేవాణ్ణి తప్ప, "ధర - తగ్గుట హెచ్చు కొఱకె" అనే విస్తృతార్థాన్ని గ్రహించలేకపోయేవాణ్ణి. మొత్తం మీద ఎలాగైతేనేం, వందల కొద్దీ పద్యాల్ని బట్టీ పట్టి పదసంపదను పెంపొందించుకున్నాను. అందువల్లనే ఈనాడు ఏదో నాలుగు పద్యాలు వ్రాయగలుగుతున్నాను.

మన పూర్వ సాహిత్యం అంతా రాజాశ్రితమైనదే! కవికుల గురువు కాళిదాసు, "భోజనం దేహి రాజేంద్ర, ఘృతసూప సమన్వితం" అన్నట్లే, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, "నిరుపహతి స్థలంబు రమణీయ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెము, ఆత్మకింపైన భోజనము, ఉయ్యల మంచము" కావాలన్నాడు. రాజులు అటువంటి వాటినన్నింటిని సమకూర్చి పెట్టారు. అందుకు తగ్గట్టుగా కవులు మంచి కావ్యాలను వ్రాసి వారికి అంకితమిచ్చారు. ఆ సందర్భంగా, కృతిపతి ప్రశంస చేయడం మన తెలుగు కవులగు రివాజు. భీమవరం శ్రీ రామరాజభూషణ సాహిత్య పరిషత్తు అధ్యక్షులు, "అభినవ భోజ" శ్రీ భూపతిరాజు రామకృష్ణంరాజు గారికి నా జాహ్నవి ఖండకావ్య సంపుటిని అంకితమిస్తూ...
కవియున్, పండితుడున్, మహారసికుడున్, కర్మిష్ఠియున్, యోగిపుం
గవుడున్, పూర్వ ప్రబంధ పద్య పఠనా గంధర్వుడున్, నిర్వికా
ర వదాన్యుం డతిశాంతు డాత్మ జనతా రక్షైక దీక్షారతుం
డు వినీతుండును భక్తిభావ నిరతుండున్ నీ వహో భూపతీ
అని నేనూ కృతిపతి ప్రశంస చేశాను. కయ్యానికి, వియ్యానికి, నెయ్యానికి సమ ఉజ్జీ కావాలంటారు గనుక

సహజకవిత్వ కౌశలుని, సాత్వికమూర్తిని నన్ను పిల్చి, "మీ
దుహితను మా కొసంగుడు యధోక్తముగా" నని వేడ నీవు నా
కు హితుడు, బంధువున్, మనువుకున్ తగువాడవయౌట సంస్కృతీ
విహితమె యౌట లెస్సయని విజ్ఞులు మెచ్చగ నీ కొసంగితిన్
అని చెప్పాను. అది సరేననుకోండి.

ప్రశంసా కావ్యాలు ప్రపంచంలో అన్ని భాషల్లోనూ ఉన్నాయి. ముఖ్యంగా ఉర్దూ, ఫారశీ భాషల్లోని కావ్యాలను "ఖసీదా" లంటారు. ప్రశంస చేసినంత మాత్రాన కవులు రాజులకు పాదాక్రాంతు లవుతారనుకోకండి. చమత్కారంగా వారిలోనున్న లోపాలను కూడా బయట పెడతారు.

పూర్వం తిరుమల రాయుడు అనే ఒక రాజుండేవాడు. అతనికి ఒక కన్ను లేదు. అతన్ని కవి ప్రశంసించాలి. లేమిని ప్రస్తావించ కూడదు కదా! కనుక చమత్కారంగా...

అన్నాతి గూడ హరుడవు
అన్నాతిని గూడకున్న అసుర గురుండౌ
అన్నా తిరుమలరాయా
కన్నొక్కటి మిగిలె గాక కౌరవపతివే

అన్నాడు. అంటే, "నీవు నీ భార్య కలిసి ఉంటే మూడు కళ్ళు కలిగిన శివుడిలా ఉంటావు. నీ వొక్కడివే ఉంటే, రాక్షస గురువైన శుక్రాచార్యుడిలా కనిపిస్తావు. నీకొక కన్ను అధికంగా ఉన్నది గానీ, లేకపోతే కౌరవ చక్రవర్తియైన ధృతరాష్ట్ర మహారాజులా ఉండేవాడివి" అన్నాడు. మొత్తం మీద తిరుమలరాయుడు ఒంటి కన్ను వాడను సంగతి పద్యంలో తెలుస్తూనే ఉంది.

సంగీత మపి సాహిత్యం సరస్వత్యాః స్థనద్వయం
ఏకమాపాత మధురం, అన్యదాలోచనామృతం

అన్నారు. సంగీతం వింటే ఆనందం కలుగుతుంది. సాహిత్యం చదివితే చాలదు. దాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించాలి. అప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. ఈ పద్యం వినండి -

కొండనుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు శిశువుతోడ పలుకనేర్చు
వనిత వేదములను వల్లించుచుండును
బ్రాహ్మణుండు కాకి పలలము తిను

ఇదేమిటి? కొండమీద ఉండే నెమలి కోరితే పాలిస్తుందా? పశువు శిశువును పలకరిస్తుందా? వనిత వేదాలను వల్లిస్తుందా? అసలు స్త్రీలకు వేద పఠనం నిషిద్ధం కదా? బ్రాహ్మణుడు కాకి మాంసం తింటాడా? అసలు ఏ మాంసభక్షణ అతడు చేయకూడదు కదా? ఈ పద్యానికి అర్థం పర్థం లేదనిపిస్తుంది. కానీ ఇలా విడదీసి చదవండి
కొండనుండు నెమలి, నెమలి కొండమీదుంటుంది. కోరిన పాలిచ్చు పశువు. శిశువుతోడ పలుకనేర్చు వనిత. వేదములను వల్లించుచుండు బ్రాహ్మణుండు. కాకి పలలము తినును. ఇందులో అసంబద్ధమేముంది? పాఠకుడు పద్యాన్ని చక్కగా అన్వయించి చదువుకొని ఆనందించాలి, అంతే!

మన పల్లెటూళ్ళలో పెద్దగా చదువుకోని జానపదులు సైతం పద్యాలు విని గుర్తుంచుకొని పొడుపు కథలతో వినోదంగా ఆడుకొంటుంటారు. ఈ పద్యం వినండి.

వంగతోటనుండు వరిమళ్ళలోనుండు
జొన్నచేలనుండు సోద్యముగను
తలుపు మూలనుండు తలమీదనుండును
దీనిభావమేమి తిరుమలేశా?

ఏమిటి? వంగతోటలో ఉంటుందా? వరిమళ్ళలో ఉంటుందా? జొన్నచేలల్లో ఉంటుందా? తలుపుమూల ఉంటుందా? తలమీద ఉంటుందా? ఏమిటబ్బా అని దీర్ఘంగా అలోచిస్తాం, అవునా? అసలా పద్యంలోనే జవాబు ఉంది. ఇలా చదవండి -
వంగతోటనుండు, వంగ తోటలో ఉంటుంది. వరి మళ్ళలో ఉంటుంది. జొన్న చేలల్లో ఉంటుంది. తలుపు మూల ఉంటుంది. తల మెడ మీద ఉంటుంది. అవునా? మరి ఇక ఆలోచన ఎందుకు?

ఇంకొక పొడుపు కథ వినండి -

కరయుగంబుగలదు చరణంబులా లేవు
కడుపు, వీపు, నడుము, మెడయు గలవు
శిరము లేదు గాని నరుల భక్షించును
దీని భావమేమి తిరుమలేశా?

చేతులున్నాయి. కానీ కాళ్ళు లేవు. కడుపు, వీపు, నడుము, మెడ ఉన్నాయి. కానీ తలమాత్రం లేదు. అయినా అది మనుష్యులను మ్రింగివేస్తుంది. ఏమిటబ్బా అని ఆలోచిస్తున్నారా? చొక్కా!

ఇంకొక సమస్యాత్మకమైన పద్యం చెబుతాను, దానికి సమాధానం చెప్పండి.

మామిడేల పూయు మండువేసంగిలో
బాలుడేలపోవు పశులవెంట 
ఒకని మరుగు చేరి ఒకడేల దాగును
మూటికొక జవాబె ముద్దుకృష్ణ

మండు వేసంగిలో మామిడిచెట్టు ఎందుకు పూస్తుంది? పశువుల కూడా బాలుడెందుకు వెడతాడు? ఒకడు తన చాటున ఇంకొకణ్ణి ఎందుకు దాస్తాడు? ఈ మూడు ప్రశ్నలకు మూడే మూడు అక్షరాలతో ఒకే ఒక సమాధానం చెప్పాలి. చెప్పలేరా? అయితే నేను చెబుతాను. "కాయనే".

మా ఏలూరు ప్రభుత్వ ప్రాచ్య కళాశాలలో ఉభయ భాషలు బోధిస్తాం. ఉభయ భాషలు అంటే సంస్కృతం, తెలుగు. మా కళాశాలలో లలిత, రమా కుమారి అనే ఇద్దరు అమ్మాయిలు చదువుకున్నారు. వారు నేత్రావధానం చక్కగా చేస్తారు. నేత్రావధానాన్ని మీరు చూశారో లేదో? ఇద్దరు విద్యార్థినులు ఎదురెదురుగా అల్లంతదూరాన కూర్చుంటారు. మనం ఒక పద్య పాదాన్నో, వచన వాక్యాన్నో ఒక తెల్ల కాగితం మీద వ్రాసి మొదట అమ్మాయి కిస్తాము. రెండవ అమ్మాయి ఒక తెల్ల కాగితం తీసుకుని మొదట అమ్మాయి కళ్ళతో చెప్పిన విషయాన్ని చక్కగా వ్రాసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. సభాసదులంతా నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుంటారు. మొదట అమ్మాయి తనకిచ్చిన పద్యపాదంలోని ప్రతి అక్షరాన్ని కనురెప్పల కదలికలతో రెండో అమ్మాయికి చెబుతుంది. ఆమె జాగ్రత్తగా గమనించి వ్రాసుకుంటుంది. ఒక్క రెండు, మూడు నిమిషాలలో పద్యభాగం పూర్తి అవుతుంది. అంటే ఆమె పై పద్యపాదాన్ని చదివి వినిపిస్తుందన్నమాట. ఆశ్చర్యం - మనమిచ్చిన పద్యపాదంతో అది సరిపోతుంది. ఈ విద్యను మొన్న తానాలో ప్రదర్శిద్దామనుకుని బయలుదేరారు. పాపం వీసా సకాలంలో రాకపోవడంవల్ల ఆగిపోయారు. ఈ ప్రక్రియను రూపొందించినవారు మా కళాశాల అధ్యాపకులు డా.చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ. ఆయన మంచి వేద పండితుడు.

ఆడవాళ్ళు మనలా బడబడ మాట్లాడరు. కనుసైగలతో తమకు కావలసిన పనులు చేయించుకుంటారు. కృష్ణుని బాల్యమిత్రుడు కుచేలుని భార్య వామాక్షి. గొప్ప విదుషీమణి. ఉభయభాషాప్రవీణురాలేమో! పెదవి కదపకుండా వేసిన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పిందో చూడండి -

నారీలలామ నీపేరేమి చెపుమన్న
                   తమిమీర ఎడమ నేత్రమును చూపు

అమ్మా! నీ పేరేమిటి అని అడిగితే ఎడమకన్ను చూపిస్తుందట. ఎడమకంటిని సంస్కృతంలో "వామాక్షము" అంటారు. ఆమె పేరు వామాక్షి అన్నమాట.

మత్తేభయాన నీ మగని పేరేమన్న
                   తన చేత జీర్ణవస్త్రమును చూపు

అమ్మా! నీ భర్త పేరేమిటి? అని అడిగితే చేతిలోనున్న చిరుగుల గుడ్డను చూపిస్తుందట. చిరుగుల గుడ్డను సంస్కృతంలో కుచేలము అంటారు. ఆమె భర్త పేరు కుచేలుడన్నమాట.

కుటిలకుంతల నీదు కులము నామంబన్న
                   పంజరమ్ముననున్న పక్షి జూపు

అమ్మా! నీ కులం పేరేమిటి? అని అడిగితే పంజరంలో నున్న పక్షిని చూపిస్తుందట. పక్షిని సంస్కృతంలో "ద్విజము" అంటారు. వారు ద్విజులు, అంటే బ్రాహ్మణులన్నమాట.

వెలది నీకేమైన బిడ్డలా చెపుమన్న
                   కరమొప్ప మింట చుక్కలను చూపు

అమ్మా! నీకేమైనా బిడ్డలా అని ప్రశ్నిస్తే, ఆకాశంలో నున్న నక్షత్రాలను చూపిస్తుందట. అశ్వని, భరణి మొదలైన నక్షత్రాలు ఇరవైఏడు. ఆమెకు ఇరవైఏడుమంది సంతానమన్నమాట.

ప్రభువు మీకెవరన్న గోపకుని చూపు

మీ రాజుగారు ఎవరు అంటే పశువులకాపరిని చూపిస్తుందట. అంటే గోపాలకృష్ణుడన్నమాట.

ధవుని వ్యాపారమేమన్న దండమిడును

నీ భర్త ఏంచేస్తాడమ్మా అంటే నమస్కారం చేస్తుందట. అంటే ఇంటింటికి వెళ్ళి "సీతారామాభ్యాన్నమః" అని యాచిస్తాడన్నమాట. చూశారా! ఆ నెరజాణ ఎలా సమాధానం చెప్పిందో! అదీ పాండిత్యమంటే, అదీ కవిత్వమంటే.